ఇటీవల ముదినేపల్లిలో ఆక్వా మెటీరియల్ వ్యాపారి ఓ వ్యక్తికి రూ.ఏడు వేలు నగదు ఇచ్చి మోసానికి గురికాగా, వారం రోజులు తిరగక ముందే తాజాగా మరో అడితి వ్యాపారి ఓ వ్యక్తి మాటలు నమ్మి రూ.69 వేలు బ్యాంక్ ఖాతా నుంచి పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాను మోసానికి గురైన ఉదంతంపై వ్యాపారి కోడె వెంకటస్వామి ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌బీఐ బ్రాంచిలో తన అకౌంట్ నుంచి రూ.69 వేలు మాయమైనట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్లను పోలీసులకు అందజేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలివి.. ఈ నెల 27 సాయంత్రం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ హర్షిత ట్రేడర్స్ అడితికి ఓ వ్యక్తి వచ్చి పుల్లలు కొనుగోలు చేశాడు. వాటి విలువ రూ.1500 కాగా, మా ఓనర్‌కు ఒక రూపాయి ఫోన్ పే చేస్తే ఆయన రూ.1500 మీకు ఫోన్ పే చేస్తారని ఆ వ్యక్తి చెప్పగా, ఫోన్ పేలో ఆ వ్యక్తి చెప్పిన నెంబర్ కొట్టగా, ఖాతాదారు పేరు రణ్ బీర్ స్టోర్ అని కనిపించడంతో మన ప్రాంతంలో ఇటువంటి పేర్లు ఉండవు కదా? అని వ్యాపారి వెంకటస్వామి అడిగాడు. పేరు అలాగే ఉంటుందిలే పంపండి అని ఆ వ్యక్తి నమ్మబలక డంతో వెంకటస్వామి రూపాయి ఫోన్‌పే చేశాడు. ఎంతసేపటికీ రూ.1500 తిరిగి ఫోన్ పేలో రాకపోవడంతో వచ్చిన వ్యక్తి తనవద్ద ఉన్న రూ.1500 ఇచ్చి పుల్లలు వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఫోన్ పేలో చెక్ చేసుకోగా రూ.69 వేలు ఆ ఫోన్ నుంచే రిటాబెన్ షైలేష్ కుమార్ పంచా అనే వ్యక్తికి వెళ్లినట్లు కనిపించింది. దీంతో తాను మోసానికి గురైనట్టు గుర్తించి సోమవారం స్థానిక ఎస్‌బీఐ బ్రాంచికి వెళ్లి చూడగా, తన ఖాతా నుంచి రూ.69 వేలు మాయమైనట్టు తెలుసుకుని, దీనిపై ఆరా తీశాడు. వేరే ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న తమ బంధువు ద్వారా సమాచారం సేకరించగా, సొమ్ము బదిలీ అయిన యూటీఆర్‌ను బట్టి మరో ప్రైవేట్ బ్యాంక్ ద్వారా ఆన్‌లైన్ జార్ఖండ్ రాష్ట్రంలోని బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించారు. అయితే సొమ్మును ఇలా కాజేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తొలుత రూపాయి ఫోన్‌పే చేసిన వ్యక్తి అకౌంట్‌కు కాకుండా రూ.69 వేలు వేరే వ్యక్తి అకౌంట్‌కు వెళ్లడం వెనుక పుల్లల కోసం అడితికి వచ్చిన వ్యక్తి పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఆచూకీ కోసం సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.