నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) డిప్యూటీ సెక్రటరీపై జారీఅయిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ)ను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. దీనికి కారణం న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కోర్టు ముందు హాజరు కాకపోవడమే. ఈ వ్యవహారంపై దాఖలైన రిట్ పిటిషన్‌తో పాటు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన అప్పీల్‌ను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. తమ బీఈడీ కళాశాల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్‌సీటీఈ ప్రాంతీయ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలేట్ అథారిటీ అయిన డిప్యూటీ సెక్రటరీ వద్ద అప్పీల్ వేశామని, అయితే ఈ అప్పీల్‌ను అథారిటీ పరిష్కరించడం లేదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, అప్పీల్ దాఖలు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచినప్పటికీ తమ వద్ద ఎలాంటి అప్పీల్ పెండింగ్‌లో లేదని ఎన్‌సీటీఈ డిప్యూటీ సెక్రటరీ తరఫు న్యాయవాది చెప్పడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీన్ని ఆయన కోర్టులో సవాల్‌చేశారు. ఈ అప్పీల్ బుధవారం విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీటీఈ తరఫున డిప్యూటీ సొలిసిటర్ ఎన్. హరినాథ్, న్యాయవాది వి.హేమంత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... శిక్షణ తరగతులకు హాజరుకావడంతో అధికారి కోర్టు ముందు హాజరు కాలేకపోయారన్నారు. నిబంధనలకు అనుగుణంగా పిటిషనర్ అప్పీల్ చేస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఎన్‌బీడబ్ల్యూను రద్దు చేసింది.