సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి.. రూ. 14 లక్షల పింఛన్ సొమ్మును దోపిడీ చేశారు దొంగలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పట్ట పగలే ఈ దారి దోపిడీ జరిగింది. గురువారం (ఆగస్టు 31) మధ్యాహ్నం జానకయ్యపేట గ్రామానికి సంబంధించిన పింఛను నగదు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది నక్కపల్లిలోని ఐవోబీ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకొని స్కూటీపై బయల్దేరారు. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన దుండగులు దారి కాచి నగదు దోచుకెళ్లారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ లైన్‌లోని రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న సచివాలయ సిబ్బందిపై దాడి చేసి.. కళ్లలో కారం చల్లి, డిక్కీలో ఉన్న సుమారు రూ.14 లక్షల నగదును అపహరించుకుపోయారని సిబ్బంది తెలిపారు. ఈ దోపిడీలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు తెలిపారు.
సచివాలయ సిబ్బంది వెంటనే నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నర్సీపట్నం ఏసీపీ సహా పలువురు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట గుళ్లిపాడు రహదారిలోనూ ఇదే తరహా దారి దోపిడీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళను బెదిరించి 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని తెలిపారు. వరుస దోపిడీ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.