ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి హుండీకి ,,,,,ఆగస్టు నెలలో కూడా రికార్డు బ్రేక్ ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 06:15 PM

తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. ఆగ‌స్టు నెలలో కూడా హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఆగస్టులో శ్రీవారిని 22.25 లక్షలమంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ.120.05 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. ఆగస్టు నెలలో కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు.. 43.07 లక్షలమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 9.07 లక్షలమంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే గతేడాది మార్చి నుంచి ఈ ఆగస్టు వరకు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లకుపైగా సమకూరుతోంది.


అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అలాగే అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిగారు రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామన్నారు.


బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయన్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున 2024 ఏడాది టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రి వర్యులచే విడుదల చేస్తారన్నారు.


హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలను శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల ద్వారా విడుదల చేశామన్నారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు నిర్వహించామన్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయన్నారు.


శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల లగేజీ కోసం నూతనంగా బాలాజి బ్యాగేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామన్నారు. తమ లగేజిని, మొబైల్‌ ఫోన్లను డిపాజిట్‌ చేసి తిరిగి తీసుకునే వేగంగా, సులభంగా చేపట్టేందుకు డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ ద్వారా జరుగుతోందన్నారు. ప్రస్తుత విధానంలో లగేజి గానీ, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను డిపాజిట్‌ చేస్తే ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభంగా తిరిగి పొందవచ్చన్నారు. ఈ నూతన విధానం 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఒక నెల నుండి అమలవుతోంది. ప్రతిరోజు 60 వేల మొబైల్‌ ఫోన్లు, 40 వేలకు పైగా బ్యాగులను డిపాజిట్‌, డెలివరీ చేస్తున్నామని గుర్తు చేశారు.


అవయవాలను ట్రాన్స్‌ ప్లాంట్‌ చేసే అత్యుత్తమ వ్యవస్థ స్విమ్స్‌లో ఉందన్నారు. మరణానికి దగ్గరగా ఉన్నవారు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి అవయవాలను దానం చేస్తే అవసరమైన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. అవయవదానంపై అందరూ అవగాహన పెంచుకుని ఇతరులకు తెలియజేయాలని కోరారు. శ్రీ పద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు 1822 మంది చిన్నారులకుగుండె శస్త్రచికిత్సలు, ఐదు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com