విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిలో బైక్ మీద వచ్చి డబ్బులు, మొబైల్ ఫోన్లు టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. మనం ఒంటరిగా కార్లో లేదా బైక్ మీద వెళ్తే.. ఇలాంటి సీన్లు చాలానే కనిపిస్తాయని.. ఇలా బ్యాచ్‌లు 9, 10 ఉన్నాయని అక్కడివాళ్లు మా స్నేహితుడితో చెప్పారు. వీడియోలో మీరు చూస్తున్న సీన్ ఆయనకే ఎదురైందని ఫేస్‌బుక్‌లో ఒకరు వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విశాఖ వాసులు, తరచుగా వైజాగ్‌కు ప్రయాణాలు సాగించేవారు ఉలిక్కిపడ్డారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇదేలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విశాఖలో శాంతి భద్రతల పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తే.. మరికొందరు ఏపీలో పోలీసులే లేరా? అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ అనంతరం వాస్తవాలేంటో బయటపెట్టారు.
‘‘రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి గాజువాక నుంచి విశాఖ నగరం వైపు కార్లో వస్తుండగా.. అతడు నడుపుతున్న కారు.. ఓ బైకుకు అతి దగ్గర్నుంచి వెళ్లింది. దీంతో బైక్ మీద ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న యువకుడు అతడితో వాగ్వాదానికి దిగాడు. కారులో ఉన్న వ్యక్తి భయపడిపోయి, వీడియో తీసి తన సన్నిహితులకు పంపించాడు. ఆ వీడియో అందుకున్న ఓ వ్యక్తి సదరు గొడవ వీడియోను దొంగల బ్యాచ్ దాడిగా వర్ణించి వాయిస్ నోట్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. నగరంలో ఎటువంటి క్రైమ్ ముఠాలు గానీ, బ్యాచ్‌లు గానీ లేవు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు’’ అని విశాఖ నగర పోలీసు శాఖ తెలిపారు.
ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తితే 100, 112, 1090 (క్రైమ్ స్టాపర్ ),1091(క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్) వంటి టోల్ ఫ్రీ నంబర్లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాయని.. అవసరం అనుకుంటే వెంటనే కాల్ చేయాలని విశాఖ వాసులకు నగర పోలీసులు సూచించారు. ఇలాంటి వార్తలను ఇతరులకు పంపించేవారు ముందుగా పూర్తి అవగాహన తెచ్చుకోవాలని.. అసత్య కథనాలు, ప్రజలను పక్కదోవ పట్టించే వార్తలు పంపించొద్దని నగర ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిజానిజాలు తేల్చడంలో ఆలస్యం జరిగి ఉంటే.. ఈ వీడియో మరింత వైరల్ అయ్యింది. విశాఖవాసులు, పని మీద వైజాగ్ వెళ్లే వారు భయపడుతూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. సకాలంలో స్పందించి.. అసలేం జరిగిందో అందరికీ తెలిసేలా చేసిన విశాఖ పోలీసులకు పాఠకుల తరఫున ‘సమయం’ అభినందనలు.