ఈ ఏడాది దేశంలోకి ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినా.. జులైలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతాంగంలో ఆశలు చిగురించాయి. కానీ, ఆగస్టులో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. సాధారణ వర్షపాతం అటుంచితే.. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు కురిశాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురకపోగా.. ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గత రెండు వారాలుగా పగటిపూట ఉష్ణోగ్రతల్లో అనూహ్యంగా పెరుగుదల నమోదవుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకుంది.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. తీపి కబురు అందించింది. వందేళ్లలో మొదటిసారి ఆగస్టులో తక్కువ వర్షపాతం కురిసినా సెప్టెంబరులో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. చివరిసారిగా 1901లో ఆగస్టులో ఇంత తక్కువ వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఈ వారాంతంలోనే దక్షిణాది, మధ్య భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబరు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. కాగా 91-107 % అటూఇటూగా నమోదవుతుందని ఆయన చెప్పారు.
ఒకవేళ ఎక్కువ వర్షపాతం కురిసినా జూన్-సెప్టెంబరు వానాకాలపు సగటు మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జులైలో అధిక వర్షాలు కురిసిన తర్వాత ఆగస్టులో చాలావరకు రుతుపవనాలు మందగించాయి... గత నెలలో 20 రోజులపాటు ఎక్కడా చినుకు జాడలేదు.. దీనికి ఎల్‌నినో పరిస్థితులే కారణం. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఎల్‌నినో సానుకూలంగా మారడం మొదలైంది. దీంతోపాటు తూర్పుదిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.
ఎల్ నినో సాధారణంగా భారత ఉపఖండంలో వర్షపాతాన్ని అడ్డుకుంటుంది. ఏడేళ్లలో మొదటిసారిగా పసిఫిక్‌లో మళ్లీ ఉద్భవించింది. ఆగస్టులో టిక్కుమని చినుకు పడకపోవడంతో జూన్- ఆగస్టు మధ్య మొత్తం రుతుపవన వర్షపాత సగటు కంటే 10% తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఎనిమిదేళ్లలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అరేబియా సముద్రం, బంగాళా ఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కనీసం ఒక్క తుఫానుగా ఏర్పడిన దాఖలాలు లేవు.