రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్ణాటకలోని బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం తిరుగు ప్రయాణంలో అనంతపురం జిల్లాలో ఆగారు. రాయదుర్గం మండలం పల్లేపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశనగ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు లేక పంట ఎండిపోయిందని చంద్రబాబు ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితి చూసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులను తప్పకుండా ఆదుకుంటామని అన్నారు. "టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరికీ బీమా పరిహారం చెల్లించాం. పంట నష్టపోయిన రైతులకు బీమాతో పాటు ఇన్ పుట్ రాయితీలు కూడా అందించాం. వైసీపీ హయాంలో రైతులకు రాయితీలు తొలగించారు" అంటూ వ్యాఖ్యానించారు.