చంద్ర బాబు అవినీతి మూటలతో నిండిన మీ నోళ్ళు పెగలట్లేదా..? అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీసులపై విపక్షాలు, ఎల్లో మీడియా మౌనరాగంపై రాజీవ్ గాంధీ నిలదీశారు. అమరావతి రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు చిన్న కాంట్రాక్టర్‌లలోనే దాదాపు రూ.150 కోట్లు కొట్టేశాడని, ఇందుకుగాను కేంద్ర ఐటీశాఖ నోటీసులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గుర్తుచేశారు. చంద్రబాబుకు అందిన ఈ సొమ్మును పలువురు వ్యక్తుల ద్వారా చేతులు మార్చి చేర వేయడంలో ఆయన కొడుకు నారా లోకేశ్ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీశాఖ నోటీసులో కూడా స్పష్టంగా ఉందంటూ రాజీవ్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయాలపై ఇప్పటి వర కూ చంద్రబాబు గానీ.. లోకేశ్ గానీ స్పందించకపోవడంలో అర్ధమేంటని ఆయన నిలదీశారు. గతంలో చంద్రబాబు, తన భార్యను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అవమానించారంటూ మీడియా ముందుకొచ్చి ఏడిస్తే..లోకేశ్‌నేమో పరువు నష్టం దావాలంటూ మా పార్టీ నాయకులపై హడావిడి చేశారన్నారు. మరి, ఈరోజు తనకు అన్యాయంగా కేంద్ర ఐటీశాఖ నోటీసులిచ్చిందని చంద్రబాబు మీడియా ముందుకొచ్చి భోరున ఏడ్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు. అదేవిధంగా తన తండ్రి ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా.. నోటీసులిచ్చారంటూ ఐటీశాఖపై పరువు నష్టం దావా వేసే సత్తా ఉందా..? అని లోకేశ్‌ను ఆయన నిలదీశారు.