ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా పేరు భారత్ అని మారిస్తే, వాటిని ఎలా మారుస్తారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 07:10 PM

జీ20 శిఖరాగ్ర సదస్సు హాజరయ్యే కూటమి దేశాధినేతలకు రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ముద్రించడంతో ఇండియా పేరు భారత్‌గా మారబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ అంశంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఇందుకే నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికల నిర్వహణ అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా, ఈ అంశంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన ఓ టీవీ ఛానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఇండియాను భారత్‌గా మార్చడంలో తప్పేముందని అన్నారు.


‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా దటీజ్ భారత్.. ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా పేర్కొన్నారు.. రాజ్యాంగ పీఠికలో వుయ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా (మేము భారతీయులం).. రాజ్యాంగంలో భారత్ అన్న శబ్దం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇండియాను ఉంచుతారా? భారత్‌గా మారుస్తారా? అనేది ప్రస్తుతం జరుగుతోన్న చర్చ.. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.. దాని కోసం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టి మెజార్టీ ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు.. ఇండియాను భారత్‌గా మార్చడం అంటే మనకున్న ఉనికి.. ఇండియా అనేది బ్రిటిషర్లు పెట్టిన పేరు.. కాబట్టి మన పేరు మనం పెట్టుకుందామనే ఆలోచన కావచ్చు..


పేరు మార్పునకు సమయం పడుతుంది.. దేశంలోని పలు పట్టణాలకు మనం పేర్లు మార్చుకున్నాం.. బాంబే నుంచి ముంబయి.. మద్రాస్ నుంచి చెన్నై.. కలకత్తా నుంచి కోల్‌కతా.. బెంగుళూరు నుంచి బెంగళూరు.. ప్రస్తుతం దేశానికి పేరు మార్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో? దానిపై చర్చలు జరుగుతాయి.. ఎక్కడైతే ఇండియా పదం ఉందో దాన్ని భారత్‌గా మార్చాల్సి ఉంటుంది.. ఉదాహరణకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి వాటికి ఇంగ్లీష్‌లో ఏవిధంగా మార్చుతారు?. ఐఏఎస్, ఐపీఎస్‌లు వీటిని ఏం చేస్తారు.. వీటన్నింటిపైనా చర్చలు జరుగుతున్నాయి..


ఏ పేరు మార్చినా భారతదేశంలో ఉన్న సమస్యలను దూరం చేయడం ముఖ్యమైన అంశం.. పేరు మార్చినంత మాత్రాన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి పోవు... ముఖ్యమైన విషయాలను వదిలేసి పక్కదారి పట్టించడానికే ఇలా చేస్తున్నారని కొంత మంది విమర్శిస్తున్నారు.. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరుతో ఏర్పడిన సందర్భంగా ఇలా చేస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు.. ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడితే కారణాలు, సందర్భాలను కచ్చితంగా లోక్‌‌సభ, రాజ్యసభలో చెప్పాల్సి ఉంటుంది.. ఆ సందర్భాన్ని ప్రభుత్వం ఎలా వ్యక్తం చేస్తుందో? మిగతావాళ్లు ఎలా స్పందిస్తారో? మనం వేచిచూడాలి’ అన్నారు.


ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శలపై మాట్లాడుతూ.. ‘ప్రతిదానికీ ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాల్సి అవసరం లేదు.. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు.. ఇప్పటి వరకూ 104సార్లు మార్చుకున్నాం.. ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్లే ప్రజల గొంతుక. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి.. అమృత్ కాలం నడుస్తోంది.. సెప్టెంబరులో పెట్టిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఉద్దేశం కూడా ఇదే.. అమృత్ కాలంలో మహత్తరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సందర్భంలో ఇది కూడా ఒక ప్రతిపాదన కావచ్చు.. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం భారత్‌గా మార్చడంలో తప్పేముంది’






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa