తిరుమలలో మరోసారి శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానం వెళ్లింది. కొందరు భక్తులు విమానం వెళుతున్న వీడియోను తీశారు. గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తరుచూ తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తుండడంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం మీదుగా వెళ్లిన విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇలాగే విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా చక్కర్లు కొట్టాయి.. ఒక రోజైతే ఏకంగా 6 విమానాలు ఆలయం మీదుగా వెళ్లడం కలకలంరేపింది.
తిరుమల ఆలయంపైగా విమానాలు వెళ్లడం ఆగమ శాస్త్రాన్ని ఉల్లంఘంచినట్లే అవుతుందంటున్నారు. ఏటీసీ అధికారులు మాత్రం తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం పరిధిలో ఉండటంతో గతంలోనే టీటీడీ ఈ నో ఫ్లై జోన్ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు కేంద్ర హోంశాఖ అధికారులు తిరుమల వచ్చిన సమయంలో కూడా టీటీడీ ప్రస్తావించింది.. కానీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగమ శాస్త్రంతో పాటుగా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో బర్డ్ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి చెప్పారు. జేఈవో వైద్యులు, అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిని పరిశీలించారు. టీటీడీ ఈవోధర్మారెడ్డి ఆదేశాల మేరకు బర్డ్ ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమ ఆర్థో పెడిక్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వైద్య నిపుణులు బర్డ్ కు వచ్చి పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు.
మోకీలు మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసిన ఇంజినీరింగ్, ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెంచి మరింత ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించిన అటవీ శాఖ అధికారులను జెఈవో అభినందించారు. బర్డ్‌లో అత్యాధునిక పరికరాలతో కూడిన బ్లడ్ బ్యాంక్, కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రం, సిటి స్కాన్ యంత్ర పరికరాలు ఉన్నాట్లు వివరించారు. అంతకుముందు బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలను ఆమె పరిశీలించారు. అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్ రే, స్కానింగ్, ఓపి వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa