విశాఖపట్టణం జిల్లా, హుకుంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... హుకుంపేట మండల పరిధిలోని రాప పంచాయతీ ఈదుల గరువు గ్రామానికి చెందిన మర్రి చంద్రిక(20), తడిగిరి పంచాయతీ బొడ్డపుట్టు గ్రామానికి చెందిన పాంగి చిట్టిబాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా చంద్రిక వైద్య పరీక్షలు చేయించుకోగా ఏడు నెలల గర్భిణి అని తేలింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి పెద్దల సమక్షంలో చిట్టిబాబు కుటుంబ సభ్యులతో చర్చించారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని చిట్టిబాబును కోరారు. ఈ మేరకు ఆదివారం తమ కుమార్తెను బొడ్డపుట్టు గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంచి స్వగ్రామం వెళ్లిపోయారు. కాగా చిట్టిబాబుకు నెల రోజుల క్రితం వేరే యువతితో పెళ్లి జరిగిందని చంద్రికకు తెలిసింది. తండ్రికి ఫోన్ చేసి రెండో భార్యగా ఉండడం తనకి ఇష్టం లేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆదివారం రాత్రి ఆ గ్రామానికి సమీపంలోని మామిడిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గ్రామస్థులు గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమె తండ్రి మర్రి సుబ్బారావు సోమవారం స్థానిక ఎస్ఐ సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.