ఏ టెండర్లూ పిలవకుండా సీమెన్స్‌కు రూ.371 కోట్లు అప్పనంగా చెల్లించిందని టీడీపీ ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి బైజూస్ కంపెనీ సేవలు పొందడానికి వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందా? అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... విద్యార్థులకు పాఠాలు బోధించే కంటెంట్ తీసుకోవడానికి టెండర్ అక్కర్లేదని వాదించింది. అదే సూత్రం సీమెన్స్‌కు వర్తించదా? విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. ఆ సాఫ్ట్‌వేర్‌కు సీమెన్స్ పేటెంట్ పొందింది. ఆ కంపెనీ మాత్రమే ఆ సాఫ్ట్‌వేర్ ఇవ్వగలుగుతుంది. 2013లో గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం సీమెన్స్‌తో ఇదే శిక్షణకు ఒప్పందం కుదుర్చుకుని అమలు చేసింది. ఈ శిక్షణను దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో మోదీ చెప్పారు. అక్కడ ఐదు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం రూ.489 కోట్లు ఖర్చు చేసింది. మన రాష్ట్రంలో 42 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఆరు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు కేవలం రూ.371 కోట్లే ఖర్చు చేశాం. గుజరాత్ కంటే రూ.110 కోట్లు తక్కువ పెట్టాం. ఎందుకు ఎక్కువ ఖర్చు చేశారని మోదీని అడిగే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.