రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆర్ధిక సంవత్సరానికి కాను రూ.61,500 కోట్లకు పైగా అప్పులు చేసింది. ఇందులో ఆర్‌బీఐ ద్వారా రూ.40,500 కోట్లు, కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా రూ.21,000 కోట్ల పైచిలుకు రుణాలు తెచ్చారు. తాజాగా మంగళవారం తెచ్చిన రూ.2,000కోట్ల అప్పులో రూ.1,000 కోట్లను 7.48శాతం వడ్డీతో 15ఏళ్లలోగా, మరో రూ.1,000 కోట్లను 7.46 శాతం వడ్డీతో 18ఏళ్లలోగా పూర్తిగా చెల్లించాలి. ఇదిలా ఉండగా, ఆర్‌బీఐ వద్ద నుంచి వేజ్ అండ్ మీన్స్ రూపంలో, ఓడీ రూపంలో చేబదులు కింద జగన్ ప్రభుత్వం దాదాపు రూ.4,000కోట్ల పైచిలుకు తీసుకుని వాడేసింది. గతవారం (సెప్టెంబరు 5న) తెచ్చిన రూ.3,000 కోట్ల అప్పును పూర్తిగా ఓడీ కింద ఆర్‌బీఐకే ప్రభుత్వం చెల్లించింది. ఈ వారం తీసుకొచ్చిన రూ.2,000 కోట్లను కూడా ఆర్‌బీఐ వద్ద తీసుకున్న అప్పులకు జమ చేయడానికి ఉపయోగించే అవకాశాలున్నాయి.