జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 700 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైయస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 15 వతేదీ నుంచి 30 వతేదీ వరకు అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా గృహాలలో ఆరోగ్యసేవలు గురించి ఆరాతీసి అవి అవసరమైన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీనుంచి 30 వతేదీ వరకు రాష్ట్రంలోని సచివాలయాలలో పరిధిలో ప్రతి రోజూ 700 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారికి 14 రకాల వైద్యసేవలు అందిస్తామని 105 రకాల మందులను ఉచితంగా అందిస్తామని వివరించారు.