ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయరహదారి పక్క ఆగి ఉన్న లారీని అదుపుతప్పి ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు ఘటనా స్థలిలోనే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులక కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన యువకులు.. వినాయక చవిత పండగ నేపథ్యంలో విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ఒంగోలుకు వచ్చారు. విగ్రహం పని పూర్తయిన తర్వాత.. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురూ ఒకే బైక్‌పై వచ్చినట్టు తెలిపారు. వీరి ద్విచక్రవాహనం మద్దిరాలపాడు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి జాతీయ రహదారి పక్క ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినాయకచవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్న యువకులు.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలమకున్నాయి. పండగ వేళ వారి కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది.