ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాహ్నవి మృతిపై అందుకే నవ్వాను.. ఏ శిక్షకైనా సిద్ధమే: అమెరికా పోలీస్ అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 03:39 PM

ఈ ఏడాది జనవరిలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన ప్రాణాలు కోల్పోయిన ఏపీ విద్యార్ధిని కందుల జాహ్నవి (23) మరణాన్ని హేళన చేసి మాట్లాడిన సియాటెల్ పోలీసు అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భారతీయ విద్యార్ధి మరణాన్ని చులకన చేసిన మాట్లాడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను భారత్‌ డిమాండ్ విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం కీలక మలుపు తిరిగింది. తాను జాహ్నవిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ఆ అధికారికి సియాటెల్‌ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది.


కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి జనవరి 23న సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అంటూ ఆ వీడియోలో తక్కువచేసి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి లేఖ రాశారు. అటు భారత్‌ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.


ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు. తాజాగా ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల విభాగం గిల్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన దృశ్యాలు బాడీక్యామ్‌ వీడియో రికార్డ్‌ చేసినవి.. అయితే, ఆ సంభాషణల్లో ఒక భాగం మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి.. అవి బయటకు రాలేదు.. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్‌ వ్యాఖ్యానించింది.


మరోవైపు, ఈ ఘటనపై డేనియల్ వివరణ ఇస్తూ ఉన్నతాధికారులకు రాసిన లేఖను కూడా గిల్డ్‌ విడుదల చేసింది. లాయర్లను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్‌ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్టులో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని తెలిపారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేయడానికి వెళ్లాను. అక్కడ నుంచి తిరిగొస్తుండగా తోటి అధికారికి ఫోన్‌ చేసి ఘటన గురించి వివరించాను... అప్పటికి నా విధులు పూర్తయ్యాయి.. అయితే బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న సంగతి నేను గ్రహించలేదు.. నా వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డయ్యింది. అయితే, నేను కేవలం లాయర్ల వాదనల గురించే మాట్లాడాను.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలకు దిగుతారో గతంలో చాలా సార్లు ప్రత్యక్షంగా చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’ అని డేనియల్‌ తన లేఖలో వివరించారు.


అంతేగానీ, భారతీయ విద్యార్ధిని మరణాన్ని తక్కువచేసి.. అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియకుంటే ఇలాంటి దురదృష్టకర ఊహాగానాలే వైరల్‌ అవుతాయని డేనియల్ అన్నారు. ఈ అంశంపై పారదర్శకంగా విచారణ జరగాలని, ఉన్నతాధికారులు తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని తెలిపారు. మరోవైపు డేనియల్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్‌లైన్‌ పిటిషన్లు మొదలయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com