ఆగస్టు 11న తిరుమల మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితపై చిరుత పులి దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భక్తులు భయాందోళనకు లోనయ్యారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీశాఖ అధికారులు ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. చిరుత కదలికలు చిక్కడంతో.. బోనులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ నాలుగు చిరుతలను బంధించారు. దీంతో చిన్నారిని చంపేసిన చిరుత దొరికినట్టేనని భావించారంతా.
కానీ చిన్నారి లక్షితను బలి తీసుకున్న మ్యాన్ ఈటర్ చిరుత ఇంకా తిరుమల కొండల్లోనే తిరుగుతోందని తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోనులో చిక్కిన చిరుతల్లో రెండు మ్యాన్ ఈటర్లు కావని డీఎన్ఏ రిపోర్టులు తేల్చాయి. దీంతో ఈ రెండింటిని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు. మరో రెండో చిరుతలను జూపార్క్‌లోనే ఉంచిన అధికారులు.. వాటికి సంబంధించిన డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండు చిరుతల్లో ఒకదానికి అసలు దంతాలే లేవని.. మరో చిరుత 15 నెలల పిల్ల అని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చిన్నారి లక్షితపై దాడి చేసి హతమార్చిన మ్యాన్ ఈటర్ చిరుత ఇంకా చిక్కలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లక్షితపై దాడి చేసి చంపేయడానికి ముందు అలిపిరి నడక మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బోన్లు ఏర్పాటు చేసి దాన్ని బంధించారు. కొద్ది రోజులపాటు జూపార్క్‌లో ఉంచిన అనంతరం దాన్ని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే చిన్నారి లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది.
దీంతో బాబుపై దాడి చేసిన చిరుతే తర్వాత కూడా లక్షితపై దాడికి తెగబడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి మనిషి రక్తం, మాంసానికి అలవాటు పడిన క్రూర మృగాలు.. మనుషులపై పదే పదే దాడి చేస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మనిషి రక్తం మరిగిన ఆ చిరుత ఏమైందనే ప్రశ్న తలెత్తుతోంది. నాలుగు చిరుతలను బంధించారని ఊపిరి పీల్చుకుంటున్న భక్తులు, టీటీడీని ఈ వార్త కలవరానికి గురి చేసేదే.