జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కొకెర్‌నాగ్ గడోల్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, తీవ్రవాదులకు మధ్య గత ఏడు రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మరో జవాన్ అమరుడయ్యాడు. సెప్టెంబరు 13న అదృశ్యమైన జవాన్ ప్రదీప్ సింగ్ మృతదేహాన్ని సెప్టెంబరు 18 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుర్తించారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిక్ లైట్ ఇన్‌ఫాంట్రీ విభాగం సిపాయి ప్రదీప్ సింగ్.. కొకెర్‌నాగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. ఏడేళ్ల కిందటే సైన్యంలో చేరిన పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ప్రదీప్ సింగ్‌కు భార్య ఉంది.
కొకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గత మంగళవారం సాయంత్రం ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొదటి రోజు 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కల్నల్ మన్‌ప్రతీ సింగ్, మేజర్ అశోక్ ధోనక్, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం డీఎస్పీ హుమయూన్ భట్‌లు ఉగ్రవాదులతో పోరాడతూ అమరులయ్యారు. కోకెర్‌నాగ్ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం అందింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి నుంచి నడిచే ‘కశ్మీర్ ఫైట్’ అనే బ్లాగ్ ‘అనంతనాగ్ ప్రాంతంలోని కోకెర్‌నాగ్ గడోల్ అడవుల్లో భారత సైన్యంపై రెసిస్టెన్స్ ఫైటర్స్ ఆశ్చర్యకరమైన ఎదురుదాడికి పాల్పడ్డారు’ అని పేర్కొంది.
పీర్ పంజాల్ పర్వతాలు ఉగ్రవాదులకు అనుకూలంగా మారాయి. ఓ కొండపై గుహలాంటి ప్రదేశాన్ని ముష్కరులు స్థావరంగా మార్చుకుని.. అక్కడ నుంచి భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. దట్టమైన అడవి, ఎత్తైన పర్వతాలపైకి చేరుకోవడం సైనికులకు సవాల్‌గా మారింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి గుహలోని రహస్య స్థావరాలను పేల్చివేతకు డ్రోన్‌లు సహా అత్యాధునిక ఆయుధాలను మోహరించారు.