కెనడా ప్రధాని భారత్ గురించి ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత రాయబారిపై కెనడా నిషేధం విధించగా.. దానికి బదులుగా కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ కెనడాల మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించేందుకే ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి భేటీ అయినట్లు తెలుస్తోంది.
కెనడాలో గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంపై కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం కెనడా అనుసరిస్తున్న తీరు.. దానికి కౌంటర్‌గా భారత్ ఏ వైఖరి అవలంభించాలి.. ఈ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు ఎలా కూడగట్టాలనే విషయాలతో పాటు మరిన్ని కీలకమైన అంశాలపై మోదీ, జై శంకర్ చర్చించినట్లు తెలుస్తోంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ఆ దేశ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్‌లో సోమవారం మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఏడాది జూన్ 18 వ తేదీన కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేశారు. అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని జస్టిన్ ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే తీవ్ర ఆరోపణలు చేయడంతో పెద్ద వివాదం తలెత్తింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని చెప్పడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టి పారేసింది. అవన్నీ అసంబద్ధమని.. ప్రేరేపితమైనవని తిరస్కరించింది. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ తీవ్రవాదిగా ప్రకటించింది. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఉన్న అతనిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. అయితే సోమవారం చేసిన వ్యాఖ్యలపై కాస్త తగ్గిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్‌ను రెచ్చగొట్టాలని గానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని గానీ తమ ప్రభుత్వం చూడటం లేదని పేర్కొన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి అంశం స్పష్టంగానే ఉందని.. సరైన ప్రక్రియ ఆధారంగానే తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నిజ్జర్ హత్య కేసు గురించి భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.