సైన్యంలో పురుష నర్సుల నియామకాలపై నిషేధం వెనుక ఉన్న హేతుబద్ధతను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. సాయుధ దళాలలో లింగ సమానత్వం గురించి మాట్లాడుతూ.. సియాచిన్‌లో మహిళా అధికారిని నియమించగలిగినప్పుడు.. ఒక పురుషుడ్ని కూడా సైన్యంలో నర్సుగా ఎందుకు నియమించకూడదని నిలదీసింది. సైన్యంలో కేవలం మహిళలకే నర్సులుగా అవకాశం కల్పించే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఆర్డినెన్స్ 1943, మిలటరీ నర్సింగ్ సర్వీస్ (ఇండియా) రూల్స్ 1944ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ నరులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ.. సైన్యంలో ఈ సంప్రదాయం దీర్ఘకాలం నుంచి కొనసాగుతోందని తెలిపారు. అయితే, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పుడే చట్టాన్ని తీసుకొచ్చిందని ఆమె అన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ ప్రకటనకు మద్దతు తెలిపిన ధర్మాసనం.. ‘అవును, పార్లమెంటులో ఒక వైపు మీరు మహిళలకు సాధికారత గురించి మాట్లాడుతున్నారు.. మరోవైపు మీరు పురుషులు నర్సులుగా చేరలేరు అని చెబుతున్నారు.. అయితే, ఒక మహిళ (అధికారి) అయితే సియాచిన్‌లో విధులు నిర్వర్తించినప్పుడు.. పురుషుడ్ని నర్సుగా ఎందుకు నియమించకూడదు’ అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలు చేరేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని, లింగవివక్ష తగదని పదే పదే చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలు చేసిందని భాటి ధర్మాసనానికి తెలిపారు. ఇదిలావుండగా.. పిటిషన్ వేసిన ఇండియన్ ప్రొఫెషనల్ నర్సుల సంఘం తరపున న్యాయవాది అమిత్ జార్జ్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అన్ని ఆసుపత్రుల్లో పురుష నర్సులు ఉన్నారు.. ఒక వర్గాన్ని మినహాయించే పద్ధతికి సైనిక వ్యవస్థలో కూడా చోటు లేదని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని అన్నారు. అనంతరం తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది.
అంతకు ముందు ఈ విషయంలో కేంద్రం వైఖరిని తెలియజేయాలని ధర్మాసనం కోరింది. ‘నర్సింగ్ శిక్షణ పొంది, అర్హత కలిగిన అనేక వేల మంది పురుషులు దేశంలో ఉన్నారు.. సైన్యం నర్సింగ్ కార్ప్స్‌లో వారికి అవకాశం కల్పించకపోవడం అన్యాయం... రాజ్యాంగ విరుద్ధం ఇది వారి ఉపాధి, వృత్తిపరమైన పురోగతిని కోల్పోయేలా చేస్తోంది’అని నర్సుల సంఘం తన అభ్యర్థనలో పేర్కొంది. దీని వల్ల సైన్యం, దేశం నిబద్ధత కలిగిన నిపుణుల సమూహాన్ని కూడా కోల్పోతోందని తెలిపింది. ఇదే సమయంలో కేవలం మహిళలకే అవకాశం కల్పించే మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఆర్డినెన్స్, 1943 మిలటరీ నర్సింగ్ సర్వీస్ నిబంధనలను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.