జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటని తప్పాడని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేస్తానని చెప్పి అధికారం చేపట్టాక వాగ్దానము నిలుపుకోలేదని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీఎం దాస్ అన్నారు. జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉయ్యూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ విధానాన్ని బలవంతంగా అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం చూస్తున్నదన్నారు. జీపీఎస్ పేరుతో మోసం చేస్తే ఓట్‌ఫర్ ఓపీఎ్‌సతో తిప్పికొడతామని హెచ్చరించారు. యూటీఎఫ్ నేత జీవీ రమణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇద్దరు జేఏసీ నాయకుల అండచూసుకుని ఉద్యోగుల హక్కులు కాలరాస్తే ఆ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో కాలగర్భంలో కలసి పోయిందని, ఇప్పుడు నలుగురు జేఏసీల అండచూసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదన్నారు.