నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి.. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా.. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతావు అంటూ హెచ్చరించారు. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి.. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో.. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి అంటూ సవాల్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారని మంత్రి మండిపడ్డారు. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని.. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు.