అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ వాయిదా తీర్మానం చదివే స్థితిలో కూడా స్పీకర్ లేరని.. తాము మాట్లాడుతుంటే మైకులు ఆపేస్తారన్నారు అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రం గంటల తరబడి అవకాశమిస్తారని.. నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు జరుగుతోందన్నారు. స్పీకర్ వైఖరి.. అధికారపక్షం తీరును నిరసిస్తూ ఈ సమావేశాలు ముగిసేవరకు ఉభయసభల్ని టీడీపీ బహిష్కరిస్తున్నామన్నారు.
టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చాలా స్పష్టంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. ప్రధానప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఒక్క అక్షరం పొల్లుపోకుండా చదవాల్సిన స్పీకర్ దాన్ని పక్కన పెట్టడం నిజంగా బాధాకరం అన్నారు. చంద్రబాబునాయుడిపై పెట్టిన అక్రమకేసులు వెంటనే ఎత్తి వేయాలి.. ఆయన విషయంలో తప్పుచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ తాము తీర్మానం ఇచ్చామన్నారు. తమ తీర్మానంపై చర్చిస్తామని చెబుతున్నవారు గతంలో శాసనసభలో చర్చలు ఎలా జరిగాయో ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది అన్నారు.
నాలుగున్నరేళ్ల నుంచి చట్టసభల్లో టీడీపీ, చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడం తప్ప, ఏనాడైనా ఈ ప్రభుత్వం ప్రజాసమస్యలపై చర్చించిందా? అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల.. వైఎస్సార్‌సీపీ శాసన సభ్యుడిగా పనిచేయడం వల్ల అధికారపక్షానిది పైచేయి అవుతోందరన్నారు. నాలుగున్నరే ళ్లలో ఎప్పుడూ ప్రతిపక్షానికి అవకాశమివ్వలేదని.. తాము మాట్లాడకుండా చేసి, వాళ్లు మాత్రం సినిమాలు చూపిస్తుంటారన్నారు. చాలా సందర్భాల్లో చెప్పాం.. వారు చూపించే సిని మాలకంటే తాము చూపించే సినిమాలు ప్రజలకు చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడూ టీడీపీప్రభుత్వం చేసిన పనులపై, చంద్రబాబుపై దుమ్మెత్తి పోయడం తప్ప ఏనాడూ అర్థవంతంగా చర్చ జరిపింది లేదన్నారు. తాము వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే తమ మైకులు ఆపేస్తారని.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఇదే జరుగుతోంది అన్నారు. ఈ ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ముందు చంద్రబాబుపై పెట్టి న అక్రమ కేసులు ఎత్తివేసి, చేసిన తప్పుకి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అది చేశాక ప్రత్యేకంగా ఒక ఐదురోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి.. అచ్చం అవినీ తిపైనే చర్చిద్దామన్నార.
ఆ సమావేశాల్లో జగన్ చేసిన అవినీతి..ఆయనపై ఉన్న కేసులు.. న్యాయస్థానాల్లో ఎదుర్కొంటున్న విచారణ తీరుపై చర్చిద్దామన్నారు. అలాగే ఈ ప్రభుత్వం కక్షతో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులపై కూడా చర్చిద్దామన్నారు. ఈ విధంగా జరిగే సమావేశాలను స్థానిక, జాతీయ మీడియాకు ప్రత్యక్షప్రసారం చేసే అవకాశం కల్పిద్దామన్నారు. అప్పుడు ఎవరి బాగోతం ఏమిటో ప్రజలకు కూడా అర్థమవుతుందన్నారు. ముందు ప్రభుత్వం ఈ పనిచేస్తే తాము అన్నిఅంశాలపై ఎన్నిరోజులైనా చర్చించడానికి సిద్ధమేనన్నారు. అవసరమై తే ఈ విధంగా నిర్వహించే ప్రత్యేక సమావేశాలకు తమ నాయకుడిని కూడా తీసుకొస్తామన్నారు. సభలో అడుగుపెట్టనని ఆయన గతంలోనే చెప్పారని.. కానీ తాము ఆయన్ని ఒప్పించి తీసుకొస్తామన్నారు. మేం చేసిన ప్రతిపాదనకు అధికారపార్టీ సిద్ధమేనా అన్నారు.
శాసనసభను వైఎస్సార్‌సీపీ కార్యాలయం కంటే దారుణంగా మార్చిన ఘనత ఈ స్పీకర్‌దే అన్నారు. తమను ‘యూజ్ లెస్ ఫెలోస్’ అన్నారు.. అలా తిట్టిన వ్యక్తి చెప్పేది తాము ఎందుకు వినాలని ప్రశ్నించారు. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు.. ఆ స్థానం విలువను ఎలా కాపాడాలో కూడా తెలియకపోతే ఎలా? అన్నారు. తమను యూజ్ లెస్ ఫెలోస్ అని వైఎస్సార్‌సీపీ వాళ్లను ‘మన సభ్యులు’ అని గౌరవంగా మాట్లాడటం ఏమిటన్నారు. ఆ వ్యాఖ్యలతో స్పీకర్ స్థానాన్నే ఆయన అగౌరవపరిచారన్నారు. తమకు అనుకూలంగా ఉండే మీడియా సిబ్బందిని సభలోకి అనుమతించి.. తాము మాట్లాడేది మాత్రమేచూపిస్తూ.. అధికారపక్ష సభ్యులు వేసే వీరంగం ప్రజలకు తెలియకుండా చేస్తుంటే తాము వీడియోలు తీయక ఏం చేయాలి అన్నారు. సభలో జరిగేవి ప్రజలకు తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నారు కాబట్టే.. తాము మొబైల్స్‌లో వీడియాలు తీశామన్నారు.
తాము 17 మంది ఉంటే.. తమ చుట్టూ 200మంది మార్షల్స్‌ను పెట్టారన్నారు. తమ చుట్టూ గోడకట్టినట్టు మార్షల్స్ నిలబడితే.. స్పీకర్ ఏం చేస్తున్నారో.. అధికారపార్టీ సభ్యులు ఏంచేస్తున్నారో తమకెలా తెలుస్తుంది అన్నారు. ధైర్యముంటే శాసనసభలో జరిగే ప్రతి పరిణామాలను నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేయగలరా అన్నారు. తాము మాట్లాడేటప్పుడు బయటికి తెలియకుండా ప్రకటనలు ప్రసారం చేస్తారని.. వాళ్లు మమ్మల్ని తిట్టేది మాత్రం ఆపకుండా ప్రసారం చేస్తారన్నారు. శాసనసభలో జరిగేది సభ్యస సమాజానికి తెలియకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు కాబట్టే.. తాము మొబైల్స్‌లో వీడియాలో తీశామన్నారు. శాసనసభ ముసుగులో ఇష్టానుసారం రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు.