ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. ఇది ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. సెప్టెంబరులో సాధారణంలేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇవాళ కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని.. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నేడు దాదాపు రాష్ట్రమంతటా మబ్బుగా ఉండి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 68.7 మిల్లీ మీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా 51.8, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 47.8, పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరులో 39.2, కృష్ణా జిల్లా గుడివాడలో 35.2, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 33, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీ 30, పార్వతీపురంలో 28.4, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 26.2, ఏలూరు జిల్లా నూజివీడులో 22.8, కైకలూరులో 21.6, ఏలూరు జిల్లా పోలవరంలో 18.4, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 16.2, ఏలూరు జిల్లా భీమడోలులో 16.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 15.4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలసలో 14.8, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 14, ఏలూరు జిల్లా కుక్కునూరులో 12.4, ఏలూరు జిల్లా వేలూరుపాడులో 11.4, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 11.2, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 11.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 10.6, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 10.6, చిత్తూరు జిల్లా నగరిలో 10.6, అన్నమయ్య జిల్లా రాజంపేటలో 10.4, నంద్యాల జిల్లా రుద్రవరంలో 10.4, శ్రీకాకుళం జిల్లా పలాసలో 10.2, ఇచ్చాపురంలో 10.2, ఏలూరులో 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 8.30 గంటలవరకు బంటుమిల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం కురిసిన వర్షంతో వరిపైరు కొంతమర ఊపిరిపోసుకుంటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సాగునీటి కొరత కొంతమేర తీరుతుందని రైతులు చెబుతున్నారు.