ముఖ్యమంత్రి, ఆయన సమీప కుటుంబసభ్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ సమూహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్-2023 పేరుతో చట్టం తీసుకురానుంది. ఆ మేరకు రూపొందించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే సీఎం భద్రతకు ఒక విభాగం ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత లేదు.ఎస్‌ఎస్‌జీ ద్వారా ముఖ్యమంత్రి, భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత కల్పిస్తారు. నివాసం వద్ద, రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడకలోనూ వారికి భద్రత అందిస్తారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడూ ఈ రక్షణ ఉంటుంది. ఏపీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ నివశిస్తున్న సీఎం కుటుంబసభ్యుల భద్రత కోసం ఎస్‌ఎస్‌జీ పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరికీ ప్రభుత్వ ఖర్చుతో భద్రత ఏర్పాటు చేస్తారు.