విశాఖపట్నానికి చెందిన రామ్ టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఇతను పట్టుబడితే మరికొందరి పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డ్రగ్స్ దందాలో భాగస్వాములైన సినిమావాళ్ల గుట్టు రట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులో ఉండే నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన రామ్ వాటిని కప్పా భాస్కర్ బాలాజీ ద్వారా విక్రయించేవాడు. బాలాజీ వాటిని నిర్మాత వెంకటరత్నారెడ్డి, దేవరకొండ సురేష్, అర్జున్, మురళి, కొల్లి రామ్‌చంద్, ఇంద్రతేజ, కలహర్‌రెడ్డి, రామ్‌కుమార్‌తోపాటు టాలీవుడ్‌లో మరికొందరికి సరఫరా చేస్తున్నాడు. వీరి దందాపై పక్కా సమాచారం అందుకున్న నార్కోటిక్ విభాగం అధికారులు మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీ చేసుకుంటున్న వెంకటరత్నారెడ్డి, మురళిని అరెస్ట్ చేసి, దర్యాప్తును వేగిరం చేశారు. నిందితులు స్నాప్‌చాట్‌లో ఆర్డర్లు తీసుకొని, కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. బెంగళూరులో ఉండే నైజీరియన్లు అమోబి చుక్వాడిముంగోల్(29), ఇక్బారే మైఖేల్(32), థామస్ అనాఘాక(49)లను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి కొనుగోలుదారుల సమాచారం సేకరించారు. రామ్ పట్టుబడితే పెద్ద సంఖ్యలో డ్రగ్స్ వినియోగదారులకు సంబంధించిన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.