రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారని అనంతపురం టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. అనంతపురం రాంనగర్‌లో బాబుకు మద్దతుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రామగిరి మండలం వెంకటాపురం ఎల్లమ్మ ఆలయంలో మాజీ మంత్రి పరిటాల సునీత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం అరవింద్ నగర్ మసీదులో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాయదుర్గం శాంతినగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యాడికి మండల కేంద్రంలో పార్టీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలకు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన వద్ద నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు పార్టీ శ్రేణులతో కలిసి రిలే దీక్షలు కొనసాగించారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఉరవకొండ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు.