మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి. యాడికిలో టీడీపీ నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో జేసీ బ్రదర్స్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ఈ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
చంద్రబాబు స్వతహాగా శాంతిపరుడన్నారరు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. విచ్చిన్నకర శక్తులు అరాచకాలకు దిగారని.. చంద్రబాబును ఎలాంటి విచారణ చేయకుండా జైల్లో పెట్టారన్నారు. ఇది ఏ రాజ్యాంగంలో లేదని.. ఎలాంటి విచారణ చేపట్టలేదని.. చాలా అన్యాయమన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగితే కళ్లుమూసుకొని నిద్రపోయారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును చాలా ఇబ్బంది పెడుతున్నారని.. ఇలా చేస్తే ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం నడపలేరన్నారు.
రాష్ట్రంలో రాచరికపాలన కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే జగన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. జగన్ చేస్తున్న పనులు చూసి ప్రజలకు అసహ్యం కలుగుతోందని.. చంద్రబాబుకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబును రోజుల తరబడి జైల్లో పెడితే జగన్‌ను కూడా సంవత్సరాల పాటు జైల్లో పెడతారని.. చంద్రబాబు జైలుకు పోయినా సానుభూతి వస్తుందన్నారు.
తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారని.. ఈకేసులో బెయిల్ కాకుండా క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు కోసం రాబోయే రోజుల్లో నిరసనల్లో మరింత దూకుడు పెంచాలన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల్లో ఆందోళన ఉద్యమంగా మారుతుందని.. అప్పుడు ఆ రోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామని.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అవుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబ్బంది కొరత ఉందన్న పోలీసులు.. చంద్రబాబుని వందల మంది చుట్టుముట్టి అరెస్టుకు అంతమంది ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉండి 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి, చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం ఆశ్చర్యం లేదన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే చంద్రబాబుని అక్రమ అరెస్టుతో జైలులో పెట్టడం దారుణం అన్నారు. ఇప్పుడైనా ప్రజలు రోడ్లమీదకు రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు.