చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఉద్యమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసింది. కొత్త మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి నియోజకవర్గాల స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఉమ్మడిగా జనంలోకి ళ్లడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. ఈ క్రమంలో- తాజాగా ఓ యాక్షన్ కమిటీని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. 14 మందితో కూడిన కమిటీ ఇది. ఎంపిక చేసిన కొందరు సీనియర్ నేతలను ఈ జాబితాలో చేర్చింది. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు, బాబు ష్యూరిటీ- భవిషత్య్ గ్యారంటీ మేనిఫెస్టోపై ప్రచార కార్యక్రమాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇందులో- యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాలయ అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్, నారా లోకేష్ ఉన్నారు.