ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలతో జనసేన దూకుడు పెంచుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దూకుడు పెంచుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ మరోమారు నాలుగో విడత వారాహి విజయ యాత్ర మొదలు పెట్టనున్నారు.
ఈ క్రమంలో నిన్న తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల అంతర్గత సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుపాల్గొని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో రానున్నది జనసేన టిడిపి ప్రభుత్వం అని పేర్కొన్న నాగబాబు, టిడిపి జనసేన పొత్తు కు తూట్లు పొడిచే విధంగా ఎవరు మాట్లాడొద్దని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి అందరూ పనిచేయాలని సూచించారు.
జనసేన నేతలు టిడిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేయాలని నాగబాబు పేర్కొన్నారు. ఒక్కొక్కరు పదిమందితో ఓటు వేయించేలా పనిచేయాలని, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఆయన ఆలోచనలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నాగబాబు పేర్కొన్నారు. జగన్కు ఒకసారి అవకాశం ఇస్తేనే రాష్ట్ర అభివృద్ధి అదః పాతాళానికి పడిపోయిందన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులను బలవంతంగా లాక్కుని బ్యాంకుల్లో తాకట్టు పెడతాడని విమర్శించారు. జగన్ అవినీతి, అసమర్ధ పాలనకు చరమగీతం పాడి అధికార పీఠం నుంచి గద్దె దించే వరకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. త్వరలో నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణాజిల్లాలో మొదలు కానుందని, అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న బలమైన లక్ష్యంతో మొదలైన వారాహి విజయయాత్ర తొలి 3 విడతలు విజయవంతంగా ముగిసాయి అని పేర్కొన్న నాగబాబు ప్రభుత్వ అవినీతి, దౌర్జన్య పాలన, వాలంటీర్ల వ్యవస్థ అరాచకాలను ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఎండగట్టారని, పవన్ ఆలోచనలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు