అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పెద్దపప్పూరు మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర కళ్యాణ్ మండపానికి భూమి పూజ చేసేందుకు జేసీ సిద్ధమయ్యారు. అయితే దానికి అనుమతి లేదంటూ భారీగా పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారని ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు మరోసారి పోలీసులు మోహరించారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆలయ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పలు అభివృద్ధి పనులకు జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయన అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున జేసీ నివాసం వద్దకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై జేసీ మండిపడ్డారు.. పోలీసుల మోహరింపుతో అనంతలో హైటెన్షన్ వాతావరణం ఉంది.