విశాఖలో సంచలనంరేపిన బాలుడి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో బాలుడ్ని అతడి స్నేహితులే హత్య చేసినట్లు తేలింది. భీమిలి సమీప అన్నవరం ప్రాంతానికి చెందిన మైలపల్లి రాముకు, వన్‌టౌన్‌లోని గొల్లవీధి ప్రాంతానికి చెందిన నూకరత్నానికి పద్దెనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు చిన్న పుట్టిన తర్వాత ఐదేళ్లకు విభేదాలు తలెత్తాయి. దీంతో 12 ఏళ్ల కిందట నూకరత్నం భర్త నుంచి విడిపోయి కుమారుడితో ఉంటోంది. చిన్నా ఎనిమిదో తరగతితో చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు.
చిన్నాకు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు మైనర్ బాలురుతో పరిచయం ఉంది. వీరంత కలిసి మద్యం, గంజాయి సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవారు. తనను తాను చిన్న విస్కీగా పరిచయం చేసుకున్నాడు. విస్కీ అనే రౌడీషీటర్ జైలుజీవితం గడుపుతుండడంతో తానే ఇక నుంచి విస్కీ అంటూ స్థానికులను బెదిరించేవాడు. రోజూ గొడవలకు దిగుతూ యువకులతో ఘర్షణపడేవాడు.
శుక్రవారం వేకువజామున అదే ప్రాంతా నికి చెందిన నలుగురు మైనర్లతో సిగిరేట్ విషయంలో చిన్న గొడవ పడ్డాడు. ఆగ్రహానికి గురైన ఆ మైనర్లు బటన్ కత్తి తీసుకుని హత్య చేశారు. అతని మృతదేహాన్ని వారు ఓ గోనె సంచిలో కుక్కారు. ఓ ఆటోను పిలిచి వినాయక చవితికి సంబంధించి పూజా పత్రిని సముద్రంలో పడేయాలని చెప్పారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి ఫిషింగ్ హార్బర్ జెట్టీ-11లో పడేశారు. డ్రైవర్ ఇంటికి వెళ్లి చూసుకునే సరికి ఆటో నిండా రక్తపు మరకలు ఉండడాన్ని గ్రహించి ఆ మైనర్లను గట్టిగా ప్రశ్నించాడు. దీంతో చేసిన తప్పును ఒప్పుకుని వారు వన్ టౌన్ పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారునిందితులను అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు పోలీసులు.