ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేద యువకుడి అవయవదానం.. సీఎం హెలికాప్టర్‌లో గుండె తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 07:01 PM

తాను మరణిస్తూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. అతడి గుండెను తరలించేందుకు ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. నిరుపేద దంపతులకు చెందిన బిడ్డను మృత్యువు విషాదకర రీతిలో కబళించింది. పుట్టెడు దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు మానవత్వంతో స్పందించి 5 కుటుంబాల్లో వెలుగులు నింపారు. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలిస్తోంది. చిలకలూరిపేట పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే కట్టా రాజు, మల్లీశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. మల్లీశ్వరి ఇళ్లలో పాచి పనులు చేస్తూ, రాజు ఆటో నడుపుకుంటూ.. పిల్లలను పోషిస్తున్నారు. వారికి మంచి చదువులు అందించేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.


పెద్ద కుమారుడు కృష్ణ (18) నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెస్టెంబర్ 23న ఉదయం రోజూ మాదిరిగానే.. కాలేజీ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు కోసం వేచి ఉండగా, అటుగా వచ్చిన హర్యానాకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. కృష్ణతో పాటు మరికొంత మంది విద్యార్థులపైకి దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి కాళ్లు విరిగిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయిన కృష్ణను అతడి మేనమామ స్థానికుల సాయంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు గుంటూరులోని రమేష్ హాస్పటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు.


సుమారు 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి కుమారుడికి చికిత్స అందించారు ఆ నిరుపేద తల్లిదండ్రులు. తండ్రి రాజు మరో ఆలోచన లేకుండా, తన ఆటోను అమ్మేశాడు. అలా రూ. 60 వేలు వచ్చాయి. మల్లీశ్వరి బంధువుల్లో కొందరు తమ ఒంటిపై ఉన్న తాళిబొట్లు, ఇతర ఆభరణాలను తీసిచ్చారు. వాటని తాకట్టు పెట్టి ఆస్పత్రిలో కట్టి తమ కుమారుడిని బతికించుకునే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. కానీ, దేవుడు కరుణించలేదు. బ్రెయిన్ సర్జరీ నిర్వహించినా.. కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. తమ పెద్ద కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. రమేష్ హాస్పిటల్ వైద్యులు అవయవదానంపై వారికి అవగాహన కల్పించగా.. అందుకు అంగీకరించారు. దీంతో కృష్ణకు చెందిన లీవర్, రెండు కిడ్నీలు, గుండెను వేరు చేసి, వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషంట్లకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.


రమేష్ హాస్పిటల్స్ నుంచి యువకుడి అవయవాలను తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గుండెను హెలికాప్టర్ సహాయంతో తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న.. కర్నూలు జిల్లా కొత్తపేటకు చెందిన శ్రీనివాస్‌కు వైద్యులు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాలేయాన్ని వైజాగ్ కిమ్స్ హాస్పిటల్‌కి, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌కి, మరొక కిడ్నీని గుంటూరు రమేష్ హాస్పిటల్లో అవసరమైన వారికి అమర్చారు. యువకుడి తల్లిదండ్రుల నిర్ణయం ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపింది. కృష్ణ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఉపయోగించే హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయడం.. మానవతా దృక్పథంతో తీసుకున్న మరో నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa