తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. కొండపై భక్తుల రద్దీ బాగా తగ్గింది.. శ్రీవారి దర్శనానికి ఇవాళ (మంగళవారం) భక్తులను నేరుగానే క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి కేవలం ఒక గంట నుంచి మూడు గంటల సమయం మాత్రమే పడుతోందని చెబుతున్నారు. సర్వ దర్శనం టోకెన్‌లు లేని వాళ్లకు మూడు గంటల్లోనే దర్శనం అవుతోంది. సోమవారం 72,137 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. 23,735మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. అయితే రద్దీ భారీగా ఉండాల్సింది పోయి బాగా తగ్గింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబరు 26న చక్రస్నానం కూడా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్దగల స్వామి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం పూర్తి చేశారు. ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భద్రతా సిబ్బందితోపాటు ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చక్రస్నానం పవిత్రత రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాలని టీటీడీ సూచించింది. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మాడ వీధులు, బయటి క్యూలైన్లు, ఇతర సెక్టార్లలో బాధ్యతలు అప్పగించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు టీమ్‌వర్క్‌తో చక్కగా పనిచేశారని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అభినందించారు. గరుడసేవ విజయవంతానికి అధికారులందరూ అంకితభావంతో పనిచేశారని తిరుమలలో సెక్టోరల్ అధికారుల సమావేశంలో జెఈవో కొనియాడారు. మరో 20 రోజుల వ్యవధిలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. అనంతరం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని సెక్టోరల్ అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa