విశాఖలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఉన్నారు పోలీస్ కమిషనర్ (సీపీ) రవిశంకర్ అయ్యన్నార్. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కొద్దిరోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేశారు.. అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. తాజాగా నగర పరిధిలో జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మద్యం త్రాగి వాహనాలు నడిపిన 165 మంది పై కేసులను నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. వారికి మెజిస్ట్రేట్ మొత్తం రూ. 5,92,000 జరిమానా, ఏడుగురు వ్యక్తులకు వారం రోజులు, ఒకరికి 10 రోజుల జైలు శిక్ష విధించారు.
మద్యం తాగి వాహనాలు నడపటం వలన మీతో పాటు మీ తోటి వారు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు పోలీసులు. అదేవిదంగా జైల్ శిక్షల ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల కేసుల్లో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనాలు నడపడమే కారణంగా తేలిందట. ఇటీవల ట్రాఫిక్ విభాగం అధికారులతో సీపీ రవిశంకర్ అయ్యన్నార్ సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
మందుబాబుల ఆట కట్టించేందుకు బ్రీత్ అనలైజర్లతో తనిఖీలను ముమ్మరం చేశారు. దొరికినవారిని కచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. పోలీసుల చర్యలతో తాగి వాహనాలు నడిపేవారిలో మార్పు వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వన్‌టౌన్ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు పోలీసుల తనిఖీల్లో తేలడంతో అతనితోపాటు ఆటో యజమానిపైనా కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచగా డ్రైవర్‌కు 15 రోజులు జైలుశిక్ష, యజమానికి రూ.ఏడు వేలు జరిమానా విధించారు.
గతంలో ఎవరైనా మద్యం సేవించి పట్టుబడితే పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిస్తే రూ.మూడు వేలు జరిమానా విధించేవారు. కొన్ని సందర్భాల్లో మాత్రం సామాజిక సేవ చేయాలని, కూడళ్లలో నిలబడి ప్లకార్డులు పట్టుకుని రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించేవారు. కానీ ఇప్పుడు 15 రోజులు జైలు శిక్ష లేదా రూ.ఐదు వేలు నుంచి రూ.పది వేలు వరకూ జరిమానా విధిస్తున్నారు. కాబట్టి మద్యం తాగి వాహనాలు నడపొద్దని.. ఒకవేళ దొరికితే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరిస్తున్నారు విశాఖ పోలీసులు.