పెళ్లి అంటే చాలు కొంతమంది గ్రాండ్‌గా చేసుకోవాలని భారీగా ఖర్చులు పెడుతూ ఉంటారు. వంటల దగ్గరి నుంచి పెళ్లి మండపం వరకు అన్నీ ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తూ ఉంటారు. డబ్బులు లేకపోయినా పెళ్లి అంటే అప్పులు తీసుకువచ్చి మరీ వివాహాలు చేస్తూ ఉంటారు. అయితే డబ్బు ఉన్న వాళ్లు ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్‌లు చేసుకున్నా పర్లేదు కానీ అలాంటి వారిని చూసి మధ్యతరగతి, పేద ప్రజలు కూడా అలాంటి పెళ్లిళ్లే చేసుకోవాలని ఆశపడి.. ఆ తర్వాత అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు. అయితే ఇలాంటి మధ్యతరగతి, పేద ప్రజలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక సూచనలు చేశారు. హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు జరిపించడం మంచిది కాదని పేర్కొన్నారు. లేనిపోని గొప్పలకు పోయి.. ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. ఉన్నంతలో పెళ్లిళ్లు చేసుకుని హాయిగా జీవించాలని సూచించారు.
కర్ణాటక చామరాజనగర్‌లోని మాల మహదీశ్వర హిల్స్ ఆలయంలో నిర్వహించిన సామూహిక పెళ్లిళ్ల వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. కొంతమంది జనం.. తమ స్థాయికి మించి.. అప్పులు తీసుకువచ్చి ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారని అయితే అది మంచి విధానం కాదని పేర్కొన్నారు. ఇక మరికొందరు వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి మరీ రుణాలు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి పెళ్లి చేసి.. ఆ పెళ్లికి అయిన అప్పులు తీర్చేందుకు జీవితాంతం వారి కష్టాన్ని ధారపోయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తక్కువ ఖర్చుతో నిర్వహించే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం సిద్ధరామయ్య కన్నడవాసులకు పిలుపునిచ్చారు. సామూహిక వివాహాలతో భారీ ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా మాల మహదీశ్వర హిల్స్ ఆలయ అభివృద్ధి గురించి సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో మాల మహదీశ్వర హిల్స్ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేసిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. అప్పుడు తీసుకున్న చర్యలే ప్రస్తుతం ఆలయానికి వస్తున్న ఆదాయానికి చిహ్నమని చెప్పారు. ఇక ఇటీవల తమ ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత రవాణా ఏర్పాటు చేయడంతో మహిళలు భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. మాల మహదీశ్వర హిల్స్‌లో ఉన్న భవన్‌ను తపోభవనంగా మారుస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. మహదేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టే దానికి తపోభవనం అని పేరు మార్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.