మనం భూమి మీదికి రాకముందే తల్లి కడుపులో ఉన్నపుడే గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు మొదలైన హృదయ స్పందన ప్రాణం పోయేవరకు ఆ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే మొదట గుండె ఎలా కొట్టుకోవడం ప్రారంభమైంది అనేదానిపై ఎంతో మంది పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుండె కొట్టుకోవడం ఎలా ప్రారంభం అవుతుంది అనే దానిపై చేసిన పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాలు చేశారు. గుండెలో ఉండే కణాల్లో తొలిసారి కదలిక మొదలవుతుంది.. అది ఎలా ప్రారంభమవుతుంది అనే విషయాలను తెలుసుకున్నారు.
తల్లి కడుపులో పిండంగా ఉన్నపుడు ఎలాంటి కదలిక లేకుండా ఉండే దశ నుంచి లబ్ డబ్ అంటూ కొట్టుకునే వరకు ఎలాంటి దశలు ఉంటాయో తెలుసుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్ సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. అయితే ఇందుకోసం వారు జీబ్రా ఫిష్ చేపలపై పరిశోధనలు చేశారు. తమ పరిశోధనల కోసం ఫ్లోరసెంట్ ప్రొటీన్లు, హైస్పీడ్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను వినియోగించుకున్నారు. అభివృద్ధి చెందుతున్న జీబ్రాఫిష్ గుండె కణాల్లో కాల్షియం, స్థాయి, విద్యుత్ చర్యలను పరిశీలించగా.. శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే గుండెలో ఉండే కణాలు నిశ్చల స్థితి నుంచి అకస్మాత్తుగా కొట్టుకునే స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు.
కాల్షియం, విద్యుత్ సంకేతాల్లో పెరుగుదలకు అనుగుణంగా ఈ గుండె కొట్టుకునే ప్రక్రియ సాగుతోందని పేర్కొన్నారు. గుండె కొట్టుకోవడం ప్రారంభించడం నుంచే మిగతా కణాలతో కలిసి సమన్వయం కొనసాగిస్తాయని గుర్తించారు. ఒకసారి గుండెలోని కణాలు కొట్టుకోవడం ప్రారంభించినపుడు అందులోని ఒక ప్రాంతం క్రియాశీలకంగా మారి విద్యుత్ ప్రకంపనలు వెలువడుతున్నాయని తేల్చారు. అవి మిగతా కణాల గుండా ప్రవహించి వాటిని కూడా ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ముందుగా కొట్టుకునే గుండె కణాలు ఏవీ అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టంమని.. ఒక్కో జీబ్రాఫిష్‌లో ఒక్కో రకంగా ఉన్నట్లు తెలిపారు.
ఇక పూర్తి స్థాయిలో పనిచేసే గుండెలో ప్రత్యేక పేస్‌మేకర్ కణాలు హృదయానికి స్పందనలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే తల్లి కడుపులో ఉన్న పిండానికి గుండెలోని కణాలు సొంతంగా కొట్టుకుంటాయని గుర్తించారు. ఒకేవిధంగా కొట్టుకోవడం మొదట గుండె కణాలు నేర్చుకుంటున్నాయని.. పక్కనే ఉన్న కణాల సమన్వయంపై మొదట్లోనే నేర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న జీబ్రాఫిష్ పిండం.. గుండెపై చేసే పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే సరాసరిగా ఒక వ్యక్తి జీవిత కాలంలో గుండె 300 కోట్ల సార్లు కొట్టుకుంటుందని తెలిపారు.
అసలు గుండె ఎలా కొట్టుకుంటుంది.. ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి గత కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో విజయం సాధిస్తే గుండెకు సంబంధించిన వ్యాధులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గుండె సరిగా వృద్ధి చెందకపోవడం, గుండెకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైనపుడు ఏం జరిగింది.. దాన్ని ఎలా అధిగమించి.. నయం చేయాలనే దానిపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa