ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలూచీస్థాన్ ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం.. పాక్ మంత్రి సంచలన ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 09:03 PM

రెండు రోజుల కిందట మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయి జంట ఆత్మాహుతి దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. బలూచిస్థాన్ ప్రావిన్సుల్లోని మస్తుంగ్ జిల్లాలో మసీదు వద్ద జరిగిన ఈ ముష్కర దాడిలో 65 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఉగ్రదాడి విషయంలో భారత్‌పై దాయాది సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల వెనుక భారత గూఢచారి సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ హస్తం ఉందని పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆరోపించారు.


పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో భారత గూఢచారి సంస్థ రా ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు.‘మస్తుంగ్ ఆత్మాహుతి దాడి కారకులపై సివిల్, మిలిటరీ, అన్ని ఇతర సంస్థలు సంయుక్తంగా ప్రతీకారం తీర్చుకుంటాయి... ఆత్మాహుతి దాడిలో భారత గూఢచారి సంస్థ రా హస్తం ఉంది’ అని పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులు ఉండగా.. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాబోయే కాలంలో రెండు దేశాల పెను దుమారాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. ఈ వ్యాఖ్యలపై భారత్ విదేశాంగ శాఖ ఇంత వరకూ స్పందించలేదు.


మరోవైపు, ఆత్మాహుతి దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంత వరకూ ప్రకటన చేయలేదు. ఫిదాయి (ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి) డీఎన్‌ఎను విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం ప్రాథమిక నివేదికను సమర్పించారు. మస్తుంగ్ జిల్లా మదీనా మసీదు వద్ద మొదటి దాటి జరగ్గా.. కొద్ది నిమిషాల వ్యవధిలో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని మసీదు వద్ద రెండో దాడి జరిగింది. ఈద్-ఇ-మిలాద్ ఊరేగింపు కోసం పెద్దఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.


రెండో దాడిలో పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తిపై హత్య ఆరోపణలు, ఉగ్రవాద నేరాలతో కూడిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సీటీడీ తెలిపింది. గతంలో దాడులకు కారణమైన నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ తమపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa