మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాల్ సెంటర్, పవర్ సబ్ స్టేషన్ సెంటర్, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని అర్ధరాత్రి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆదేశాలతో పాటూ గుంటూరులో నమోదైన కేసుతో పరవాడ డీఎస్పీ కెవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి వచ్చారు. బండారుకు 41ఏ నోటీసు జారీ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు బండారు ఇంటికి తరలివచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి దగ్గర పోలీసుల మోహరించి.. ఆయన నివాసానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి పరిసర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఏ కారణంతో బండారు ఇంటికి వచ్చారని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి ఆయన ఇంటి దగ్గరద మోహరించాల్సిన అవసరం ఏంటని.. దీనికి కారణాలు చెప్పాలని ప్రశ్నించారు. బండారు సత్యనారాయణమూర్తిపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు ఐపీసీ 506,504,505 కింద కేసు నమోదు చేశారు.