ఏలూరు మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ నిరసిస్తూ మంగళవారం ఏలూరు డీఈవో కార్యాలయం ఎదుట స్కూల్ స్వీపర్లు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. టీచర్స్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ మాట్లాడుతూ అతితక్కువ వేతనాలపై పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు రోజుకి రూ.133లను చెల్లించడంలోను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మునిసిపల్ పాఠశాలలను విద్యా శాఖలో విలీనంచేసి 15 నెలలు గడుస్తున్నా సంబంధిత స్కూళ్లలో పనిచేస్తున్న స్వీపర్ల జీతాల విషయాన్ని ఇంతవరకు తేల్చకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ వేతనాలను సకాలంలో ఇవ్వకుండా పస్తులతో మాడుస్తు న్నారని ఆరోపించారు. స్కూల్ స్వీపర్ల యూనియన్ నగరశాఖ అధ్యక్షురాలు జె.స్వాతి, కృష్ణవేణి, విజయలక్ష్మి, నాగమణి, పద్మజ, లక్ష్మీరాజ్యం, రామలక్ష్మి, రత్న మణి, భాస్కర్, గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.