వీసా తనిఖీల్లో భాగంగా కువైత్‌లో అరెస్టయిన 34 మంది భారతీయ నర్సులను ఇటీవల విడుదల చేశారు. ఇందులో 19 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారుండగా, మిగిలిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకి చెందిన వారు. అందులో అయిదుగురు బాలింతలు కాగా, భారతీయ ఎంబసీ అభ్యర్థన మేరకు.. వీరు మూడు వారాల జైలు నిర్బంధం సమయంలో తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి అధికారులు అనుమతించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్‌తో సహా ఉన్నతాధికారులందరూ మూడు వారాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించిన అనంతరం, భారతీయ నర్సులను మంగళవారం విడుదల చేసినా కేసు ఇంకా ముగించలేదని తెలుస్తోంది. సరైన నైపుణ్యం, అర్హతలు లేకున్నా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలపై మొత్తం 60 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఫిలిప్పీన్స్, ఈజిప్టు దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. భారతీయులతో పాటు వారిని కూడా విడుదల చేశారు.