విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 28న సాయంత్రం 6.30 గంటలకు దుర్గగుడికి కవాట బంధనం చేస్తున్నట్లు (ఆలయ తలుపులు మూసివేత) ఈవో భ్రమరాంబ తెలిపారు. 29న తిరిగి వేకువజామున 3 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలకు కవాట ఉద్ఘటన (ఆలయ తలుపులు తెరవడం) కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్నపనాభిషేకం అలంకరణ, హారతి అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. 29న ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ, వస్త్రసేవ, ఖడ్గమాలార్చన నిలుపుదల చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.. దూరం నుంచి వచ్చే వాళ్లు అందుకు తగినట్లుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. విజయవాడ మాత్రమే కాదు.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా ఈ నెల 28న రాత్రి నుంచి 29 ఉదయం వరకు మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి తర్వాత పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలలతో పాటుగా అన్ని గుడులు మూతపడనున్నాయి.