అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మారుస్తున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. ఏఎస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టుకు సమాచారం అందించింది. ఇకపై విచారణ అధికారిగా డీఎస్పీ విజయ్ భాస్కర్ బాధ్యతలు తీసుకుంటారని.. అధికారి మార్పుపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువుగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు సీఐడీ పిటీషన్‌లో పేర్కొంది.
మరోవైపు చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లపై విచారణ వాయిదా పడింది. బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు జడ్జి నేడు సెలవులో ఉన్నారు. ఏసీబీ కోర్టులో నేడు జరగాల్సిన విచారణలు బుధవారానికి వాయిదా వేశారు. ఇటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ లోకేష్‌ను ప్రశ్నిస్తుంది. మధ్యాహ్నం ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు పంపింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొందరి పేర్లు చేరుస్తూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని పేర్లు కూడా ఉన్నాయి.