కలియుగ వైకుంఠవాసుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రతినెల శ్రీవారి దర్శనానికి వెళ్లే కోసం ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తాజాగా, నూతన సంవత్సరం 2024 జనవరిలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ బుకింగ్ షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టోకెన్లను ప్రతినెల టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే 2024 జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్ల కేటాయింపు షెడ్యూల్ను ప్రకటించింది. సుప్రభాత, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవ టిక్కెట్లకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ అక్టోబరు 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అక్టోబరు 20 ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ పేర్లను నమోదుచేసుకోవచ్చని పేర్కొంది.
అలాగే, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు అక్టోబరు 21వ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పింది. అలాగే, రూ.500, రూ.1000 వర్చువల్ సేవా టికెట్లు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణం టిక్కెట్లు అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ ( బ్రేక్ దర్శనం) టికెట్లు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మర్నాడు 24న ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో పాటు జనవరి నెలలో వసతి గదులకు ఈనెల 25 ఉదయం 10 గంటల నుంచి స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. తిరుపతిలో గదుల కేటాయింపు స్లాట్ అక్టోబరు 25న.. తిరుమలలో 26న విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. నూతన సంవత్సరంలో శ్రీవారి దర్శనానికి తిరుకలకు వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాలను గమనించి పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం.. ఆన్లైన్లో దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉండగా శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయి.