ఏపీలో ఎన్నికల హడావిడి ముందుగానే మొదలైంది. వైఎస్సార్‌సీపీ ఈ నెల నుంచే ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలకు షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందన్నారు.
జనసేన, తెలుగుదేశం ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాల వారీగా చర్చించి తుది రూపు దిద్దుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి కచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం కల్పించాలనేది తమ మొదటి లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. బీసీలకు కనీసం 30శాతం విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలనేది ప్రతిపాదన ఉందన్నారు హరిరామ జోగయ్.
అలాగే కాపుల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని కూడా ప్రతిపాదిస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో ఖరారు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయాలను 98486 34249, 70369 24692 అనే ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని హరిరామ జోగయ్య కోరారు. హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అలాగే టీడీపీ, జనసేన పార్టీలో ఉమ్మడిగా ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.