విజయవాడ దుర్గగుడి ఈవోగా పని చేస్తున్న భ్రమరాంబ బదిలీ అయ్యారు. దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని ఎస్టేట్ విభాగం జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ కేఎస్ రామారావును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన్ను మూడు రోజుల క్రితం రెవెన్యూశాఖ నుంచి దేవాదాయశాఖకు బదిలీ చేసి మంగళవారం పోస్టింగ్ ఇచ్చింది. కమిషనరేట్‌లోని ఎస్టేట్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌కి గతంలో అన్నవరం ఆలయ ఇన్‌ఛార్జి ఈవో బాధ్యతలు అప్పగించగా అక్కడి ఈవో మూర్తిని కమిషనరేట్‌లోని ఎస్టేట్ విభాగం ఇంఛార్జ్‌గా నియమించింది. మంగళవారం నాటి తాజా ఉత్తర్వుల్లో చంద్రశేఖర్ ఆజాద్‌ను అన్నవరం ఆలయం రెగ్యులర్ ఈవోగా నియమించి.. మూర్తిని రీజనల్ జాయింట్ కమిషనర్‌గా తిరుపతికి బదిలీ చేసింది. మరోవైపు దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ నూతన ఈవోగా కేఎస్ రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని అనంతరం మహామండపంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఈవో చాంబర్‌కు వెళ్తారు. ప్రస్తుత ఈవో భ్రమరాంబ ఆయనకు బాధ్యతలను అప్పగిస్తారు. భ్రమరాంబ కూడా త్వరలోనే దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని ఎస్టేట్ విభాగం జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దుర్గ గుడి ఆలయ ఈవో బదిలీపై నాలుగైదు రోజులుగా గందరగోళం కొనసాగుతోంది ముందు భ్రమరాంబను బదిలీచేసి.. ఆమె స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మళ్లీ ఆసక్తికరంగా కేఎస్ రామారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.