నంద్యాలలో కన్న బిడ్డని చంపిన కసాయి తల్లి బాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే..... నంద్యాలలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న మహేశ్, షన్నుబీలు మూడేళ్ల క్రిందట ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి గతేడాది ఆడశిశువు జన్మించింది. 19 రోజుల తర్వాత శిశువు అనారోగ్యంతో చనిపోయింది. మళ్లీ సెప్టెంబరు 22న రెండో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ 19 రోజుల పసికందు గొంతుచుట్టూ గాయాలై రక్తపు మడుగులో పడి ఉండటం, తల్లి నోటికి రక్తం మరకలుండటం.. ఉలుకూ పలుకూ లేకపోవడాన్ని చూసిన అత్తమామలు, నంద్యాల ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. తల్లి షన్నుబీ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. అత్త మామలు మాట్లాడుతూ..... కోడలు షన్నుబి తన ఆరోగ్యం బాగోలేదని, వెంటనే వెళ్లి మాత్రలు తీసుకురావాలని పదే పదే అడగటంతో ఇద్దరం కలిసి మాత్రలు తేవడానికి మందుల దుకాణానికి వెళ్లి, తిరిగొచ్చేసరికి ఇలా జరిగిందని తెలిపారు. పసికందును తమ కోడలే హత్య చేసిందని అత్తమామలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.