ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల పరిధిలో పలుచోట్ల ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు నిందితులను వీరవల్లి పోలీసులు బుధవారం చాకచక్యంగా అరెస్టు చేశారు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య మాట్లాడుతూ.... ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన మణిబాబు విజయవాడ నుంచి వస్తూ ఎ.సీతారాంపురంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న వైన్‌షాప్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి యూరిన్‌కు వెళ్లారు. ఆదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మణిబాబును కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి వెయ్యిరూపాయల నగదుతో పాటు ద్విచక్రవాహనాన్ని లాక్కుని పారిపోయారు. బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో వీరవల్లి ఎస్సై చిరంజీవి బుధవారం జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతూ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వీరిపై వివిధ జిల్లాల్లో పలు కేసులు ఉండటంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. విచారణలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ద్విచక్రవాహనచోరీలు చేసినట్టు నిందితులు అంగీకరించారు. రూ.10,24,000 విలువైన తొమ్మిది వాహనాలను సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలోని ఎస్సై చిరంజీవి బృందం రికవరీ చేశారు. ద్విచక్రవాహనాల దొంగలను అత్యంత చాకచక్యంతో పట్టుకున్న ఎస్సై చిరంజీవి బృందాన్ని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా అభినందించారు.