వైద్యపరంగా అబార్షన్‌కు అనుమతి కోరుతూ 26 వారాల గర్భిణి దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు అనుమతి కోరుతున్నారా? అని ప్రశ్నించింది. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని స్పష్టం చేసింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్న ఓ వివాహిత.. మూడోసారి గర్బం దాల్చింది. మూడో బిడ్డను కనలేనని, అబార్షన్‌కు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గత కాన్పుల తర్వాత నుంచి తాను కుంగుబాటుకు గురయ్యానని, మానసికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె కోర్టుకు వివరించింది. ఈ పిటిషన్‌పై ముందు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ అక్టోబరు 9న తీర్పు వెలువరించింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఆమె ఇప్పటికే 26 వారాల గర్భవతి అని.. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను సమర్పించింది.
దీనిపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది. దీంతో గురువారం ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అబార్షన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన ధర్మాసనం.. విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కడుపులో పిండాన్ని చంపేయాలని మమ్మల్ని ఆదేశించమంటారా? అని నిలదీసింది. అంతేకాదు, 26 వారాలు వచ్చే వరకూ ఎందుకు ఎదురుచూశారని, ముందే అనుమతి ఎందుకు తీసుకోలేదని సీజేఐ ప్రశ్నించారు.
‘‘తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యత పాటించాల్సిన అవసరం ఉంది.. సజీవంగా ఉన్న ఆ పిండం బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపేయాలని ఎయిమ్స్ వైద్యులతో మేమే చెప్పాలని కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘కడుపులో పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు.. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, అబార్షన్ చేయించుకోకుండా కొన్ని వారాలు పిండాన్ని మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపిస్తూ.. ‘బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉంది. పిండం జీవం సంకేతాలను చూపుతుంది కాబట్టి గర్భస్రావం చేయడం సరైనది కాదు. అబార్ట్ చేయాలనే ఆదేశంపై పునరాలోచించాలి’ అని అన్నారు. అబార్షన్‌కు అనుమతి కోసం అత్యాచారం బాధితురాలు చేసిన విజ్ఞప్తిపై ది కోర్టు తీర్పును ఆమె తరఫున లాయర్ ఉదహరించారని తెలిపారు. ‘ఆమె (పిటిషనర్) రేప్ బాధితురాలు కాదు. ఆమె మైనర్ కాదు. 26 వారాలుగా ఆమె ఏం చేస్తోంది?’ అని వ్యాఖ్యానించారు. ‘బిడ్డ పుట్టడానికి అనుమతించడం ఒక ఎంపిక.. ప్రభుత్వం ఆ బాధ్యతలను చూసుకోవాలి.. మరికొన్ని వారాలు వేచి ఉండి, సాధారణ ప్రసవానికి వెళ్లవచ్చు.. ఈ సమయంలో తొందరగా ప్రసవం చేస్తే పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశం ఉంది.. ప్రస్తుతం అంగవైకల్యంతో బిడ్డ పుడితే ఎవరూ దత్తత తీసుకోవడానికి ఇష్టపడరు’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.