ఆర్టికల్ 142 కింద విడాకుల విషయంలో విచక్షణాధికారాన్ని ఆచితూచి వినియోగించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వైవాహిక బంధం పునరుద్ధరించలేని విధంగా విచ్ఛిన్నమైందన్న కారణంతో పెళ్లిని రద్దు చేసే అధికారం తమకు ఉందని అని వ్యాఖ్యానించింది. అయితే, భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రమైందిగానూ.. ఆధ్యాత్మిక కలయికగానూ చూస్తారు... కాబట్టి ఆర్టికల్ 142 కింద వివాహ బంధం విచ్ఛిన్నమైందనే సాకుతో అందరినీ ఒకే గాటన కట్టకూడదని స్పష్టం చేసింది.
ఈ మేరకు హరియాణాకు చెందిన వృద్ధ దంపతుల విడాకుల పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తన భార్య (82) నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఐఏఎఫ్ మాజీ అధికారి (89) పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాను భర్తతోనే కలిసుండాలని కోరుకుంటున్నానని, జీవిత చరమాంకంలో విడాకులు తీసుకున్న మహిళ అనే కళంకంతో తాను చనిపోవాలని కోరుకోవడం లేదని కూడా ఆమె వాదించారు. ఆమె ఆవేదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని.. విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఛండీగఢ్‌కు చెందిన ఈ దంపతులకు 60 ఏళ్ల కిందట 1963లో వివాహం జరిగింది. అనంతరం పిల్లలతో వీరి వైవాహిక జీవితం 1984 వరకూ 20 ఏళ్ల పాటు సాఫిగా సాగిపోయింది. ఆయనకు 1984 జనవరిలో మద్రాసుకు బదిలీ అయిన తర్వాత ఇరువురి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. భార్యాభర్తలు మధ్య తరుచూ గొడవలు జరుగుతుండటంతో కొన్నేళ్ల తర్వాత విడాకుల కోసం ఛండీగఢ్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, ఈ తీర్పును పంజాబ్ హరియాణా హైకోర్టులో భార్య సవాల్ చేయడంతో.. సింగిల్ బెంచ్ తొలుత విచారణ చేపట్టి కింది కోర్టు ఆదేశాలను పక్కనబెట్టింది.
దీనిపై డివిజన్ బెంచ్‌లో భర్త సవాల్ చేయగా.. అక్కడ కూడా అదే విధమైన తీర్పు వచ్చింది. చివరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య వేధింపుల తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరారు. అయితే, విచారణలో ఆమెపై చేసిన ఆరోపణలను నిరూపించే సరైన సాక్ష్యాలు, ఆధారాలను సదరు వ్యక్తి సమర్పించలేకపోయారు. ఇదే సమయంలో భార్య సైతం తనకు విడాకులు వద్దని, ఆయనతో జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. గతంలో శిల్పా శైలేశ్ Vs వరుణ్ శ్రీనివాసన్ విడాకుల కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని.. విడాకులను మంజూరుచేయలేమని స్పష్టం చేసింది.